Tuesday, April 24, 2018

మూడు తరాలు

 బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.
ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టిన అన్నయ్య కేసి చూస్తూ,
“ఏమిటన్నయ్యా! బయట మళ్ళీ ఏం విడ్డూరాలు అగుపడ్డాయి? 
ఇంత కుంభవృష్టిలో ఇద్దరూ ఎక్కడైనా ఆగి,
నెమ్మదిగా  రావాల్సింది! 
ఇలాగ తడిసి ముద్దలౌతూ వచ్చారు?” 
తువ్వాళ్ళు ఇద్దరికీ ఇస్తూ అన్నాడు ప్రదీప్.
ప్రదీప్ కి స్కూటర్ తాళాలను ఇస్తూ చిన్నగా నవ్వేసాడు అనురాగ్.
వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నెను స్టవ్వుపై పెట్టేసి, చక్కెర, అక్కడే ఫిల్టర్ లో ఉన్న
డికాక్షన్ ను గిన్నెలో కలిపి, వేడి కాఫీని ఒక స్టీలు గ్లాసులో పోసి బామ్మకు ఇచ్చాడు.
వానలో తడిసి, చలికి వణుకుతూనే చీర మార్చుకున్నది.
కాసె పోసి, మడి కట్టుకునే ఆ ఏడు గజాల చీరకట్టు తెలుగుదనపు అందానికి ప్రతీక.
అనురాగ్ బామ్మకు పొగలు కక్కుతూన్న కాఫీ గ్లాసును అందించాడు.
ఆమె కోపం కాస్త చల్లబడింది.
మేడ మీదనుంచి అమ్మ వచ్చింది.
“కేకేసి పిలిస్తే వచ్చేదాన్నిగా! కాఫీ మీరే కలుపుకున్నారే!” కాస్తంత నొచ్చుకొంటూ అన్నది.
“మన  యువతరం పిల్లకాయల్లో బద్ధకాన్ని పోషించేది
ఇలాటి అమాయకపు సాంప్రదాయపు మాతృమూర్తుల ప్రేమలే, కదరా అన్నాయ్!”
తమ్ముడు ప్రవీణ్ గడుసు మాటలకు చిరునవ్వును బదులుగా ఇచ్చాడు అనురాగ్.
‘వీడెప్పుడూ ఇంతే! పోసుకోలు కబుర్ల రాయుడు! తామిద్దరూ లోనికి రాగానే
టీ కలిపి ఇచ్చి సేదదీర్చే ప్రయత్నాలేమీ చేయడు,
కానీ అమ్మ లాంటి వాళ్ళను మాత్రం- బోల్తా కొట్టించే డైలాగు బాణాలను తన మాటల తూణీరంలో
అట్టిపెట్టుకుంటాడు ‘
సెగల పానీయం అంగిట్లోకి జారాక, బామ్మ శాంతించింది.
కోడలుతో అన్నది-
“చూశావా కలికాలం చోద్యాలు కాకపోతే ఇదేమిటి?
మన కాలంలో ఎరుగుదుమా?”
కిసుక్కున నవ్వాడు ప్రవీణ్.
అతని వైపు కొరకొరా చూసింది బామ్మ.
” అనురాగ్ నెమ్మది, వీడెప్పుడూ ఇంతే! పెద్దవాళ్ళను లెక్క పెట్టడు. గంపలు గంపల నిర్లక్ష్యాన్ని
వసతో కలిపి పోసి ఉంటుంది తన ముద్దుల కోడలు!” అనుకుంది .
పరిస్థితిని బ్యాలెన్సు చేస్తూ అన్నాడు అనురాగ్.
“దారిలో ఓ చిన్న ఇన్సిడెంటు జరిగింది”
ప్రవీణ్ సోఫాలోకి ఒక్క గంతు వేసి, కూర్చుంటూ అడిగాడు.
బామ్మ, అనురాగ్ ల వివరణలతో వెలువడిన కథా సారాంశం ఇది.
***                           ***                             ***                              ***
అనురాగ్ , బామ్మను గుడికి తీసుకువెళ్ళాడు.
గంట తర్వాత బయలుదేరుతూంటే దేవళంలో బామ్మ యొక్క చిన్ననాటి స్నేహితులు తారసిల్లారు.
అనుకోకుండా కలవడంతో అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఇంకేం! ఆ పాత స్నేహితుల ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళారు.
పాత స్నేహాలతో కొత్త చుట్టరికాలను కలిపేసింది బామ్మ!
అదే, తన పెద్ద మనుమడితో ఆ ఇంటి కన్యామణితో వివాహ బంధాన్ని కుదిరించేసింది.
***                            ***                               ***                                ***
 “మన బామ్మకు హ్యాట్సాఫ్ అన్నాయ్! ఇదే ఏ మ్యారేజ్ బ్యూరో ద్వారానో ఐతే
దండిగా ఫీజులు అయ్యేవి. ఒక్క దమ్మిడీ ఖర్చు చేయకండానే నీకు పెళ్ళి కుదిర్చేసింది,
బామ్మా! నా మ్యారేజ్ కికూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి”
“అంతకంటేనా? భగవంతుడు శీతకన్ను వేయకుండా ఉంటే  నీక్కూడా బాసికం కట్టడం నా చేతుల మీదుగానే
జరిపిస్తానురా భడవా!”
***                                     ***                                 ***                                   ***

దారి మళ్ళిన సంభాషణను చెవి పట్టుకుని,
మళ్ళీ అసలు సంగతికి తెచ్చారు.
ఇంటికి తిరిగివస్తూన్నారు, అంతలోనే కుండపోత వాన.
“మనం ఏదైనా పనిమీద వస్తేనే ఇలాటి అవాంతరాలన్నీను!  హ్హు, ఇలాగ అంకపొంకాల వాన,
నా చిన్నప్పుడు తిరునాళ్ళకు వెళూంటే కురిసింది.
మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలాగ ఈ దబాటు వాన!”
బామ్మ విసురుతూన్న నానార్ధాలను వినాలనిపించిందో ఏమో-
వాన చినుకులు నింగికీ నేలకూ ఏకధారలుగా మారాయి.
“Rain! rain! gO away!” పిల్లలు కేరింతలాడ్తూన్నారు.
“కురిసింది వాన! నా గుండెలోన…..” కుర్రకారు హమ్ చేస్తూన్నారు.
అంతలోనే చిన్న సంఘటన!
ఆట్టే బయటికి రాని బామ్మకు  అది సహించరాని విషయమే!
కింద కాలువలుగా నీళ్ళు వడివడిగా ప్రవహిస్తూన్నాయి. పాదం లోతు జల ప్రవాహాలు రోడ్డు అంతటా!
అందరూ స్కూటర్లూ, బల్కులూ, మోపెడ్లనూ ఆపేసారు. 
షాపుల ముందరా, బస్ స్టాండులలో,
షెల్టర్లు ఎక్కడ దొరికితే అక్కడ ముడుచుకునుంటూ నిలబడ్డారు.
బామ్మతో బాటుగా అనురాగ్ కూడా ఒక ఇంటి చూరులాంటి చోటులో నిలుచున్నాడు.
అప్పటికే చాలామంది పిప్పళ్ళ బస్తాలో కూరినట్లుగా ఉన్నారు జనం. ‘బామ్మకు అసలే మడి. మడి పేరుతో
ఎవ్వరినీ, ఇంట్లో వాళ్ళను కూడా తాకకుండా ఉండే అలవాటును చేసిన సాంప్రదాయం…..’
“ఛి ఛీ!” అనుకుంటూ ఎవ్వరినీ తాకకుండా పక్కకు పక్కకు ఒదుగుతూ
పాపం! ఆమె నానా అవస్థలు పడుతూన్నది. ఇప్పుడు అందరూ అటుకేసి చూస్తూన్నారు
హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనను.
ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండును చటుక్కున రెండు చేతుల్లో ఎత్తుకుని
దబ్బున ఆ సన్నని ప్రవాహాన్ని దబ్బున దాటేశాడు.
అతడి కరకమలాలలో ప్రేయసి కిలకిలా నవ్వుల గ్రుమ్మరింతలు.
బామ్మ లాంటి వాళ్ళు నిశ్చేష్ఠులౌతూ, కాస్సేపటిదాకా అలాగే ఉన్నారు
‘ఇంతలు కన్నులుండ విప్పార్చి అలాగే వీక్షిస్తూ…………..’
యువత, పిల్లలూ ఆట్టే రియాక్టు అవలేదు కానీ,
ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్సు చేస్తూ మాట్లాడుకుంటూన్నారు.
“గురుడు సినిమాల్లో హీరోగా ట్రై చేసుకోవచ్చు”
“లవరేనంటావా?” 
“ఝనక్ ఝనక్ పాయల్ నో? 
పుస్కి పుస్కీనో ఐ ఉంటుంది”
“ఇలాటి వానలో తడుస్తూంటే ఇప్పుడు బాగానే ఉంటుంది,
రేపు జలుబూ, దగ్గూ….”
అప్పటికే మరి కొందరు ఆరుబైటకు అడుగేశారు, 
జడివానకు జడియకుండా.
అప్పటికి కాస్త తగ్గుముఖంపడ్తూన్న వానను చూస్తూనే బామ్మ 
“ఇక! పద! త్వరగా ఇల్లు చేరదాము”
“బామ్మా! నువ్వూ తాతయ్యా మీ పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడైనా సరదాగా
వర్షంలో తడుస్తూ ఆటలాడుకున్నారా?”
ప్రవీణ్ చిలిపితనానికి తల్లి, 
అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ
వంటింట్లోకి వేళ్ళి, భోజనపదార్ధాలను  మైక్రో ఓవెన్ లోనూ, స్టవ్వు మీదా వేడి చేసే కార్యక్రామాన్ని మొదలెట్టారు.
అనురాగ్ “తనకు ఇందాక బామ్మ ద్వారా పరిచయం ఐన కన్నెపిల్ల బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకుని” తన
కలకు వన్నెలను అద్దుతున్నాడు.
ప్రవీణ్ కొంటె మాటలకు బదులుగా బామ్మ తర్జని చూపిస్తూ అన్నది
“భడవా! పెద్దంతరం చిన్నంతరం ఎరగరు కదా 
ఈ కాలం పిల్లలు  మరీ కలికాలం కదూ! ” *
;
7, జూన్ 2012, గురువారం = మూడు తరాలు ;
7, జూన్ 2012, గురువారం = మూడు తరాలు ;
                  
బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే 
9 జులై, 2012 - విధి విలాసము - శ్రీరాముడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకము (patrika.haaram.com). 
రచయిత : కాదంబరి (కోణమానిని) ప్రచురణ తేది: 3/30/2012 12:00:00 AM ; 
My story: మూడు తరాలు in - my Blog - కోణమానిని- గురువారం 7 జూన్ 2012 
(మూడు తరాలు ; బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.) ...

రాగి చెంబు మిల మిలా …

రాగి చెంబు – నానీ చేతిలో తళ తళా మెరుస్తోంది. ఆ తామ్ర చెంబు –
శంకరాభరణం నిర్మలమ్మ మామ్మ మర చెంబు అంత అమూల్యమైనది.
ఏడేళ్ళ వయసులో పల్లకిలో పెళ్ళికూతురిగా , కూర్చుంది –
తన పక్కన తనకెంతో ఇష్టమైన ఈ తామ్ర పాత్రిక –
ఈ ఎర్రని చెంబు సృష్టించిన కథలు అబ్బో, ఎన్నెన్నో!
ఈ వేళ, నానీ సెల్లార్లోకి దిగింది .
భూతల గృహ విభాగం – అదే, సెల్లార్ లో
తులసి చెట్టుకి పూజా పునస్కారాలు చేయాలి కదా –
అందుకని ఉదక సహిత చెంబును జాగ్రత్తగా పట్టుకుని దిగింది నానీ.
మంత్రోఛాణలో ఎక్స్ పర్ట్ నానీ. శ్లోకాలు మననం చేసుకుంటూ వచ్చింది.
ఆ గేటు దగ్గర క్రీనీడలో ఎవరో ఉన్నారు,
“ఎవరదీ?” గదమాయించింది.
వార్తలలో – చదువుతూనే ఉంది,
రేడియోలో వింటూనే ఉంది, – అంటే –
ఆమె దూరదర్శన్ జోలికి ఆట్టే వెళ్ళదు,
సోఫాలో కాళ్ళూపుకుంటూ సోమరిగా కూర్చుని,
నమ్కీనుల్ని నెమరేస్తూ – చూడటమంటే చిరాకు.
వాడు కనుక దొంగే ఐతే –
ఇదిగో, ఈ చెంబుతో వాడి నెత్తిన మొట్టేయడం ఖాయం.
“నేను, మామ్మగారూ, మునిసిపాలిటీ వర్కర్ని.”
మునిసిపాలిటీ అనే మాటను పలుకుతున్నప్పుడు, వాని మొహంలో – తానే కలెక్టర్ ని అన్నంత ఠీవి మెరుపు!!!
ఉద్యోగాలు, హోదాలు – తేడాలు – తెలీవు, కనుక –
“ఐతే ఏమిటంట!?”….. – ఒక్క క్వశ్చన్ మార్కుతో – వాడి మొహం – వాడి మొహం లాగే – ఉండిపోయింది, కొన్ని క్షణాల సేపు – వాడి పోయి, ఐతే అతగాడి ఇట్లాంటి అనుభవాలు – అప్పుడప్పుడూ తటస్థ పడుతుంటాయి కాబట్టి, సెకండ్లలో తేరుకున్నాడు.
“ఇంకుడు గుంతలు తవ్వడనికి – వచ్చాను.”
“గుంటలు తవ్వుతావా? ఇక్కడ ఖాళీ ఎక్కడుంది? వెళ్ళు వెళ్ళు.”
మనవళ్ళు ప్రదీప్ – ప్రవీణ్ – అనురాగ్, మనవరాలు మినూ ఉరఫ్ మృణాళిని ;;;;;;;;;;;
ఫ్రెండు పెళ్ళికి, ప్లస్ అదేమిటో ట్రెక్కింగ్ అంటూ అందరూ వెళ్ళారు.
వాళ్ళకి ఈ వర్క్ డ్యూటీని బదాలయించేది కోడలు.
తులసి కోటకు పసుపు మెత్తింది.
వాడి అదృష్టం బాగుండి, నానీ కోడలు మెట్లు దిగి వచ్చింది.
షిఫాన్ చీర, చేతిలో వ్యానిటీ బ్యాగ్,
“సూపర్ బజార్ దాకా వెళ్ళి వస్తాను, అత్తమ్మా, మీకు ఏవైనా కావాలా?”
“మూల కూర్చూనే ముసలమ్మని, నాకేం అవసరమౌతాయి”
“కాస్త గుర్తు తెచ్చుకోండి, ఆనక, మళ్ళీ లిస్టు చెబితే నేనే వెళ్ళాల్సొస్తుంది, శోష పడుతూ. ,మందులు, అవీ ……..”
“ఆ. ఔనేవ్, విక్సు, అమృతాంజనం, బర్నాలు, ఎర్ర మందు ……. “
“సరి సరి , సరే – , అమృతాంజనం, బర్నాల్సూ – ఇప్పుడు మార్కెట్ లో లేవు గానీ, అట్లాంటివే తెస్తాను లెండి.”
“ఆ కాడికి నన్ను అడగడమెందుకు, గొప్ప శ్రద్ధ ఉన్నదానిలా.”
ఆమె మనసులోనే అనుకున్నా –
నాటకంలో స్వగతం లాగా ప్రకాశంగానే గొణుక్కుంటూనే ఉంటుంది.
కోడలికి అలవాటే, కాబట్టి – ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తుంది – అనడం కంటే –
అసలు శ్రవణేంద్రియాలలోనికి జొరబడనీయదు –
అనడం సబబు.
మున్సిపాల్టీ కుర్రాడు – “అమ్మా” తన ఉనికిని తెలిపాడు.
“వీడి మొహం మీద అన్ని గంట్లు పెట్టుకుని, ఇంకు, సిరా గుంటలు – తవ్వుతాడట.”
“హమ్మయ్య, ఈ అత్తా కోడళ్ళ వగ్ధాటికి ఇప్పటికైనా కళ్ళెం పడింది.” సినిమాలో అల్లు అర్జున్ లెవెల్లో అనుకుని, మనసులోనే సంబరపడిపోతూ, నిట్టూర్చుకున్నాడు.
“ఐతే. సరే. టవ్వు.” అంటూ అత్తగారికి ఆమె స్పెషల్ మొబైల్ కాల్స్ కు మాత్రమే పరిమితమైనది – ఇచ్చింది.
“మీరు రావడానికి ఎంతసేపౌతుంది?” వాడి బాధ వాడిది –
ఇటు చూస్తే సాదాసీదా చేనేత చీర కట్టులో మామ గారు,
తన పని పూర్తి ఐనాక,
కనీసం – టీ నీళ్ళకు కూడా నాలుగు రూపాయలు
తన చేతిలోకి వచ్చే సూచనలేవీ కనబటం లేదు,
చిన్నమ్మ గారే గతి ……. “
“అర గంటలో వచ్చేస్తాను. నీ పని పూర్తి ఔతుందా, అప్పటికి!?”
క్వశ్చన్ లాంటి వ్యాఖ్యానాన్ని వదిలి, బైకుపై వెళ్ళింది.
తీరా సందు మలుపు తిరుగుతున్నప్పుడు ఆమెకి, డౌట్ వచ్చింది,
‘ఒక వేళ వాడు – దొంగ ఈతే ….. అసలే రోజులు బాగో లేదు …… ‘
అప్పుడప్పుడూ కోడలికి –
‘అత్తమ్మ యొక్క వాడుక నుడి ‘వచ్చేస్తుంటుంది.
[ ‘అత్తమ్మ యొక్క usage – వాడుక నుడి’]
వెనక్కి వచ్చింది, “అదేమిటి కోడలా! మళ్ళీ ఏం మర్చిపోయావు …… “ అత్తమ్మ నోటి నుండి – తర్వాత వెలువడుతున్న –
ప్రెజెంట్ కంటిన్యువస్ డైలాగులను గాలికి అప్పజెప్పేస్తూ,
కోడలు మేడమీదికి గబగబా వెళ్ళింది, తలుపుకు తాళం వేసింది,
నాలుగు అరటి పళ్ళు, ఒక ఆపిలు పట్టుకుని,
“అత్తమ్మా, ఇవిగో” అని ఆమెకు ఇచ్చింది.
ఐతే తాళం వేసావా, ఇంక క్రిష్ణాష్టకం,
విష్ణు సహస్రం, శివ పంచాక్షరి – మిగిలినాయి ….. “
భగవంతుడు సర్వాంతర్యామి,
ఇక్కడే ఉండి, ఇంకుడుగుంట,
పనిని సవ్యంగా చేసేటట్టు చూస్తూ ఉండండి, చాలు.
నేను పావు గంటలో వచ్చేస్తాను.”
ఇప్పుడే కదా, అర్ధ గంటలో వస్తానని చెప్పి, పావు నిముషం పట్ట లేదు, ఊ….. ”
మున్సీడు [= మునిసిపాల్ట్ ఈ కుర్రాడు ] టేపు తీసి,
అత్యంత శ్రద్ధతో మట్టిలో కొలతలు కొలవడం మొదలెట్టాడు.
“అక్కడ తవ్వుతున్నావు –
అది నైఋతి దిక్కు, పల్లం పనికిరాదు.”,
అంటూ నానీ అభ్యంతరం.
“మరైతే ఈ మూల తవ్వుదునా?” తన మాటను ఆజ్ఞగా శిరసా వహించే అర్భకుడు ఒక్కడు ఇన్నాళ్ళకు దొరికాడు,
నానీ మనసు ఆనందంతో నిండిపోయింది.
“ఆ నై వా యీ అని చెప్పారు పెద్దలు,
అంటే ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, ఈశాన్యాలు –
నాలుగు దిక్కులు … “
మునీడు అంత కన్నా రాటు దేలినవాడు,
నానీ వాక్కులు ప్రతి అక్షరాన్నీ వదలకుండా వింటున్నాడు,
అని చూసే వాళ్ళకు అనిపిస్తుంది,
కానీ – వాని వీనులలోకి –
జీరో పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతమైనా వెళ్ళదు, అది అంతే!
ఆమె చూపిన జాగా – వెడల్పు తక్కువ.
కొంచెం పని తగ్గింది కదా అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు మునీడు –
మళ్ళీ టేప్ కొలతలు వేసి, గడ్డ పలుగుతో ఐమూలగా గీసాడు.
అలనాడు అమర శిల్పి జక్కన, రువారి మల్లిటమ్మలు కూడా
ఇంత దీక్షగా కొలతలు వేసి ఉండరు.
నానీకి పూజ, ధ్యానం కుదరడం లేదు.
చకచకా సగం లోతు చెక్కాడు మినీడు.
ఏదో టైమ్ పాస్ అవ్వాలి కదా,
“మామ్మ గారూ, మీ చెంబు తళతళా మెరిసి పోతుందండీ,
మీ పనామె బాగా తోముతుంది లాగుంది.”
‘వీడి మొహం …… నా చెంబు, పంచపాత్రల మీద కళ్ళు పడ్డాయే’
చీర కొంగులో ఆ అమూల్య వస్తువులను ఉండలాగా చుట్టి, మడిచి,
బొడ్లో దోపుకుంది.
కొత్త పెళ్ళి కూతురినైనప్పుడు – ఒడి కట్టు బియ్యం మోసాను,
ఈ నాటికి మళ్ళీ మోస్తున్నాను –
అప్పటి ఒడి కట్టు బియ్యం కంటే ఎక్కువే ఉంది ఈ చెంబు మూట.’
నడుముకు ఉన్న చెంబు చెరగు మూటను తడుముకుంటూ అనుకున్నది.
తాతగారు – అనగా నానీ మగడుగారు – ఆటో దిగి – లోనికి వచ్చారు.
:
నానీ భర్త సూట్ కేసును కింద పెడుతూ
“ఏమిటీ, ఏదో పనిని అజమాయిషీ చేస్తున్నావల్లే ఉంది.”
“చెప్పా పెట్టకుండా వచ్చేసారే, ఊళ్ళో అంతా కులాసానా” పలకరిస్తూ “కోడలు బజారుకెళ్ళింది. అదిగో, పంపు వస్తున్నది,
మంచి నీళ్ళు తాగండి.”
ఆయన రైల్ స్టేషన్ లో కొన్న వేపపుల్లతో పళ్ళు తోముకున్నాడు.
“తాతగారూ, ఇంకా పందుంపుల్లలు వాడుతున్నారా?”
“డెబ్భై ఏళ్ళు పైబడ్డాయి, ఐనా నా పన్ను ఒక్కటి కూడా కదల్లేదు.”
టూత్ పేస్టు ప్రకటనకు మల్లే – నోరు తెరిచి పళ్ళు చూపించాడు.
“నిజమేనండి, మా అన్నకు నెల కిందట రెండు పళ్ళు ఊడిపోయాయి.” , వాదన పెట్టుకునే కన్నా ఒప్పుకోవడం బహు సులువు, సుఖమున్నూ.
మునీడు – అంగీకారం విభాగం – గుత్తకు పుచ్చుకున్న మానవుడు మరి.
ముఖసమ్మర్జనం అయ్యింది, ఇంతలో కోడలు పిల్ల రానేవచ్చింది.
“అదేమిటి, అటు తవ్వావు?”
@
“మామ్మగారు ఇక్కణ్ణే తవ్వమన్నారు.”
నేను నిమిత్తమాత్రుణ్ణి – అన్న ఫోజుతో మునీడు ఉవాచ.
కోడలికి కోపం వచ్చే సూచనలు ……..
:
నానీ గబగబా మూలకు వెళ్ళి,
గోంగూరను – ఆకు ఆకునూ సున్నితంగా వలుస్తున్నది,
సీరియస్ గా మొక్క మీదకి వంగి,
ఓరగా కోడలు వైపు చూసుకుంటూ.
“సరే, త్వరగా కానియ్యి.”
“ఓ రెండొందలు ఉంటే ఇవ్వండమ్మా.”
నానీ ఆ మూలనుంచి గట్టిగా అన్నది
“అదేంటి, మున్సిపాలిటీ పని కదా,
ఇంటింటికీ ఫ్రీగా ఇస్తున్నామని,
పేపర్లో, టీవీలలో – గవర్నమెంటు – అనౌన్స్ వస్తున్నై.”
“నీవి పాము చెవులు కాంతం.”
“మరైతే మీవి పిల్లి కళ్ళు.”
@ టిట్ ఫర్ టాట్, మామ్మా, మజాకా!?
“మామయ్యా, ఎంతసేపైంది వచ్చి, రండి.” అంటూ –
కుర్రాడికి ద్విశత రూప్యములు ఇచ్చి,
మేడ మీదికి దారి తీసింది.
అందరి భోజనాదులు ఐనాయి, కిందకివచ్చారు,
మునీడు ఇంకొంచెం లోతు తవ్వాడు. పక్కనే సిమెంటు బస్తా ఉన్నది.
“మూడొందలు ఇవ్వండి.”
“ఇందాక టూ హండ్రెడ్ తీసుకున్నావు కదా.”
ఈసారి నానీ డ్యూటీని ఆయన – తన భుజస్కంధాల పైన వేసుకున్నాడు.
అదీగాక, భార్యామణి ఎదుట –
ఇంగ్లీష్ వర్డ్స్ ని యూస్ చేసే ఛాన్సును వదులుకోడు,
ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు.
“మరే, టూ హండ్రెడ్ రూపాయలు తీసుకుని,
ఇట్లాగ రొక్కించడం ఏం బాగులేదబ్బాయ్.”
“మీ ఇష్టం.”
వీర లెవెల్లో సిమెంటు బస్తాని భుజం మీద వేసుకున్నాడు,
‘వెళ్ళి పోతున్నాను, కాస్కోడి ‘ అన్నట్లుగా నిటారుగా –
అటెన్షన్, స్టాండర్టీజ్ భంగిమ పెట్టి,
గేటుకు అభిముఖంగా నిలబడ్డాడు.
కోడలు పిల్ల పర్సు తెరిచి, మూడు వందలు సమర్పించుకున్నది.
మున్సిపాలిటీ పిలగాడు నాలుగు వైపులా రాళ్ళు పేరుస్తున్నాడు,
వాటిని విప్పి మళ్ళీ మళ్ళీ పేరుస్తున్నాడు పేరుస్తున్నాడు
పేరుస్తూ…..నే ఉన్నాడు.
:
నానీ అండ్ కో – నిలుచున్నంత సేపు నిలబడ్డారు.
ఆనక విసుగు పుట్టి, అందరూ ఇంటోకి వెళ్ళి పోయారు.
వాళ్ళు అటు వెళ్ళగానే, ము||కుర్రాడు టకటకా
బోలు రాళ్ళన్నీ పేర్చేసాడు,
దోసెడు సిమెంటు పదార్ధాన్ని – పుంజీడు నీళ్ళలో రంగరించాడు.
ముఖ్య మంత్రి – శిలాఫలకం పైన సుకుమారంగా – అద్దిన రీతిలో –
పామి, తతిమ్మా సిమెంటు గోతం మొత్తం –
మోసుకుంటూ వెళ్ళిపోయాడు.
“కింద గేటు తెరిచి, మర్చిపోయారు?” ఆఫీసు నుండి –
ఏదో ఫైలు కోసం వచ్చిన కొడుకు అడిగాదు.
నానీ కిందకు దిగి చూసింది “వాడు, గేటు బార్లా తీసి, వదిలేసి, వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళాలని ఇంగితం లేదు.”
రుసరుసలాడుతూ అన్నది.
ఏమైతేనేం, కొన్ని రాళ్ళు పేర్చిన కళాఖండం
ఆవరణలో వెలిసింది అన్నమాట.
నానీ యధాప్రకారం మిల మిలా మెరుస్తున్న ప్లేటు, ఉద్ధరిణ, వగైరాలు, పూజ సామగ్రి పట్టుకుని తులసమ్మ దగ్గరికి వచ్చింది.
“ఇదిగో తాతీ”
“అదేం పిలుపూ …. “
“నేను నానీని గదా, అందుకని మీరు తాతీ ……”
“పిలుపు ఏదైతేనేం, ప్రేమలో మిళాయిస్తే అందంగానే ఉంటుంది.”
“అబ్బో సంబడం. ఇప్పుడు ముందస్తుగా చెయ్యాల్సింది,
సూర్య నమస్కార, ప్రాణాయామాలు.
ఊరికెళ్ళి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారనిపిస్తున్నది.”
“ఇదిగో తూర్పు తిరిగి దణ్ణం – పెడుతున్నా, చూడు మరి,
ఆనక ఇవే దెప్పిపొడుపులు, ఆపనే ఆపవు కదా.”
ఆవిడ తులసి కోటకు పసుపు పూసింది.
కళ్యాణ తిలకం మోస్తరు కుంకుమను తీర్చిదిద్దింది.
మంత్ర పఠనాదులతో – ప్రదక్షిణం కూడా చేసింది.
భర్తను “నందివర్ధనం, గరుడవర్ధనం పూలను కోయండి.
వయసు మీద పడింది, నా వల్ల అవడం లేదు”
“మరె నేనొక్కణ్ణే పడుచు వాణ్ణి, కోసి,
నీ కొప్పున తురుముదునా. ఉండు మరి.” ఆవిడ కిసుక్కున నవ్వింది.
నెమ్మదిగా కూర్చుంటూ, చెంబుని – పక్కన పెట్టింది.
అంతే, దభేల్ మని చప్పుడు …..
ఏమిటా అని చూసేసరికి, గోడ కూలి ఉంది.
అది నిన్న పజ్ఝెనిమిదేళ్ళ మునీడు చేసిన నిర్మాణం.
ఇంకుడు గుంట [ water pit] – అతి నైపుణ్యంగా
వాడు పేర్చి పెట్టిన బొంత రాళ్ళు,
చెంబు బరువుకే కూలాయి.
“చెంబు బరువును కూడా ఓపలేక – పొయ్యింది ఆ కుడ్యం – భామా!”
‘అసలే చిరాకు – ‘అన్ని నోట్లు, కోడలిని అడిగి, చేతిలో పుచ్చుకున్న కుర్రకుంక, పచ్చి మోసం చేసాడు.’
ఆమెకు ఉక్రోషం పొంగుకొస్తున్నది.
భర్త పైన చిర్రుబుర్రు లాడుతూ,
““చాల్లెద్దురూ, నవ్వెలా వస్తుంది, ఈ పెద్దమనిషికి,
నాకర్ధం కాదు ఈ ముసలాయన వాలకం.”
గట్టిగా అన్నది.
“కాస్త గుంతలోకి వంగి, ముందు నా చెంబు తియ్యండి.”
“ఈ వయసులో వంగమటావూ…. “
ఆమె కళ్ళలో రౌద్రం ఎరుపు చూసి, సరసానికి సమయం కాదు –
అను జ్ఞానోదయాదులు కలిగిన వాడై, ఇంకుడు గుంతలోకి దిగాడు.
తవ్వి పోసిన మట్టి, మోకాలు లోతుకు కూరుకున్నాయి.
అదృష్టం బాగుండి, ఆఫీసుకు బయలుదేరుతున్న – కొడుకు వచ్చాడు.
“అయ్యో, నాన్నా” అంటూ నిమ్మళంగా లాగాడు.
“ఇదిగో, చెంబు” చేతిలో కెంపు వన్నె పాత్ర,
“జాగ్రత్త.” , చెబుతూ, కింద సెల్లార్ లో జరిగిన సంఘటనను గూర్చి – భార్యకు ఫోన్ చేసి చెప్పి, బైకు స్టార్ట్ చేసి, వెళ్ళిపోయాడు.
“నీ చెంబు గట్టిదే”
“మరే, మన పెళ్ళి నాటి వస్తువు. ఒక్క సొట్ట కూడా పడ లేదు.”
ఆ రాగి పాత్రను అపురూపంగా చూసుకుంటూంటే –
ఆది దంపతుల ఇద్దరి బుగ్గలు సొట్టలు పడ్డాయి.
ఆ చెంపల సొట్టలలో కిరణాలను గుమ్మరిస్తూ
ఉదయ సూర్యుడు నవ్వాడు.
                                        
 – రచన :- కాదంబరి 
;                                                             
LINK ;- vihanga విహంగ  ;
http://vihanga.com/?m=201801&paged=2 ;

 రాగి చెంబు మిల మిలా … 07/01/2018   ;

అంతే కదా ఉన్నది తేడా

నానీ గణగణా మోగుతున్న ఫోన్ ని అందుకున్నది.
అది చెల్లెలు సత్యవతి నుండి.
“మా ఊళ్ళో తిరణాల జరుగుతున్నది,
మీరందరూ – యావన్మందీ – తక్షణం బయల్దేరి వచ్చేయండి.”
“సత్యం! ప్రతి సంవత్సరం తప్పకుండా జరుగుతున్నదే కదా,
ఇంత అకస్మాత్తుగా – ఈ పిలుపు –
ఏదో ప్రత్యేకత – ఉండే ఉంటుది …. ” –
“ఈ ఏడు మా పెద్దోడి చిన్నోడు కృపాకర్ – సినిమాలలో వేసే వాడు …. ,
కృపాకర్ వస్తున్నాడు, ఈ పల్లెటూరి జాతర సీనులన్నిటినీ కథలో కలుపుతాడట.
మనం గనుక అక్కడ ఉంటే, మన వాళ్ళు ఉన్న దృశ్యాలను చక్కగా తీస్తానన్నాడు …….”
“అర్ధమైంది, ఉన్న పళంగా వచ్చేస్తున్నాను.
పెద్ద తెర మీద – మన అందర్ని – మనకు మనం చూసుకుంటుంటే ఎంత బావుంటుందో ………”
బెడ్డింగు, హోల్డాలు, డజను బత్తాయిలు, హస్తం అరటి పళ్ళు,
మరచెంబుతో మంచి నీళ్ళు, డబ్బాడు వడియాలు ……..
ఇన్ని సరంజామాతో ….. రాజు వెడలె రవి తేజము లలరగ ……….
అన్నంత సంరంభంగా సాగింది నానీ ప్రయాణం.
****                 ****                          ****               ****            
కృపాకర్ చూస్తూనే పలకరించింది, “ఒరే నిధీ, నువ్వు ఉన్న సినిమాలన్నీ చూసాను ………
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, నవ రసాలు అన్నీ నీలోనే ఉట్టి పడుతున్నాయి.”
అని కితాబు ఇచ్చింది.
నిజానికి నానీకి సినిమాలు చూసే అలవాటు లేదు,
కృపాకర్ నటించిన సినిమా పోస్టర్ లను మాత్రమే చూసేది,
దిన పత్రికలలోని ప్రకటనల నన్నిటినీ కూలంకషంగా చదువుతుండేది.
ఆ పఠనా నాలెడ్జి నానీకి ఆపద్ధర్మంగా ఉపయోగపడుతూంటుంది.
“బుడబుక్కల దుస్తులు, వీడు … “ అని అనుకుంటుంది,
కొన్ని కొన్ని సార్లు పైకి అనేస్తుంటుంది కూడానూ.
‘పదేళ్ళ క్రితం బక్క పలచగా ఉన్నాడు, ఇప్పుడు బాగా ఒళ్ళు చేసాడు.’ అనుకున్నది.
ఆనక భోజనాల వేళ సమయం సందర్భం చూసుకుని అన్నది
“నిధీ, పీలగా, సన్నగా ఉండే వాడివి, ఇప్పుడు బొద్దుగా గుండ్రాయిలాగా ఉన్నావు, బాగున్నావురా.”
ఆమె అమోఘ ఉపమానాలన్నిటికీ శ్రోతలు కొంతకాలానికి శృతి పక్వంగా ఆస్వాదించడాన్ని అలవాటు చేసుకుంటారు. తప్పదు కదా.
“కృపానిధి కాదు, నానీ, పేరు మార్చుకున్నాను, కృపాకర్ – అని.”
మనసులో చిన్నబుచ్చుకున్నప్పటికీ – నవ్వుతూ అన్నాడు.
“ముద్దుపేరు, నిక్ నేము – అన్న మాట.
వేదమంత్రాల పరిమళంతో పెట్టిన పేరుకు ఎక్కువ విలువ ఉంటుంది కదూ.”
వడ్డిస్తున్న పులుసు గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టి,
గొప్ప రాచ కార్యమేదో ఉన్నట్లు, కిచెన్ లోకి చల్లగా జారుకుంది నానీ.
అన్ని వాక్ అస్త్రాలనూ ఒక్కసారే గుమ్మరిస్తే తట్టుకోగలడా అర్భకుడు,
అందుకే నిధి ఉరఫ్ కర్ కి ఊపిరి పీల్చుకోడానికి టైమ్ ఇచ్చింది నానీ.

****                 ****                          ****               ****     
తిరణాలకు బంధుమిత్ర సపరివారం – అందరూ చేరారు.
సత్యవతి మనవడు కృపాకర్ – రెండు దశాబ్దాల క్రితం ఇక్కడే కొన్ని సినీ షాట్స్ తీసాడు.
అప్పుడు చుట్టుపక్కల ముప్ఫై పల్లెటూళ్ళు కదలి వచ్చాయి.
ఆ నాటి సినిమా దర్శకుడు – అప్పటికప్పుడు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా –
పల్లె ప్రజలంతా – నటీ నటులుగా అవతారం దాల్చారు.
సుత్తి, కొడవలి, దుడ్డు కర్రలు, సకల పరికరాలు, సమస్త వస్తువలనూ ఎత్తి పట్టుకున్నారు.
కెమేరాలో నిండుగా విప్లవ దృశ్యాలు నిండి పోయాయి.
ఆ రోజున ఏ పండుగ లేకుండానే – తిరణాల సందోహం నెలకొన్నది.
సత్యమ్మ – ప్రధమ షూటింగ్ కు ప్రత్యక్ష సాక్షులు ఐన అప్పటి వర్గం ప్రజలు – అందరూ –
నేటి మూవీ షూటింగ్, సీనులని ఆసక్తిగా ఎదురుచూసారు.
కృపాకర్, ఇతర యాక్టర్లు – ఖరీదైన దుస్తులు ధరించారు.
40 రోజుల పాటు – డ్యూయెట్లు, డాన్సులు –
ఆ గ్రామాన్ని స్వర్గధామంగా మార్చాయి.
పాతిక కార్లు గాలిలోకి ఎగరడం, యుద్ధ బీభత్సాలు ……..
ఓహ్, న భూతో న భవిష్యతి.
ఈ గాలి, నేల మొత్తం – మరో ప్రపంచం అయ్యింది.
****                 ****                          ****               ****     
ఈ నాడు – సినీ చిత్రీకరణలు, కథాంశం సైతం తేడా వచ్చింది.
కృపాకర్ డొక్కలు ఎండిన పేద ప్రజలకు నేతగా – అప్పటి సినిమాలో ఉన్నాడు,
ఇప్పటి చిత్రకథ పూర్తిగా భిన్నంగా ఉన్నది.
ఈ నాటి film లోని హీరో ఐన – కృపాకర్ బిజినెస్, ఫ్యాక్టరీ నిర్మించాడు
[సినిమాలోనే కాక – నిజ జీవితంలోనూ ఫ్యాక్టరీ ఓనర్ అతను]
ఇక స్టోరీ ప్రకారం ;- కృపాకర్ వ్యాపారం, ఫ్యాక్టరీలకు –
స్వార్ధపరులైన – కుత్సిత మనస్కులు ఐన లేబర్ నాయకులు సమస్యలు సృష్టించారు.
లేనిపోని ప్రోబ్లమ్స్ వలన బిజినెస్ కుదేలైనది, ఫాక్టరీ మూతబడింది.
హీరో కృపాకర్ – విదేశాలకు వెళ్ళి, అక్కడే వ్యాపారం చేసి స్థిరపడాలని
కృతనిశ్చయంతో బయలు దేరాడు.

****                 ****                          ****               ****     
ప్రివ్యూకి కూడా ఆహ్వానం అందుకున్నారు,
బంధు మిత్ర సపరివార సహితంగా థియేటర్ కి వెళ్ళారు, చూసారు, ఆనందించారు.
“మా కళ్ళముందు పెరిగిన వాడివి, ఇంత గొప్పవాడివైనావు,
చాలా సంతోషంగా ఉంది.”
అభినందన మందారమాలలు వేసారు అందరూ. – ఆనక అందరూ గృహోన్ముఖులైనారు.
మూవీ తీరుతెన్నులను గూర్చి – , చర్చలలో విస్తరించుకుంటూ –
తమ తమ అభిప్రాయాలను – తలో రకంగా మాటలకు ప్రకాశం తెచ్చారు.
“మన నిధి సినిమాలలో చేరిన కొత్తల్లో – బీదా బిక్కీ జీవితాలను సినీమాలుగా తీసాడు కదా.
ఇప్పుడేమిటి, తలా – తోకా లేని కథలను జనాల మీదకు గుమ్మరిస్తున్నాడు!?” చిరాకుగా అన్నాడు నానీ పెనిమిటి.
నానీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది – ;
“మొదటి దశ నాటికి నిధి – తెల్ల కాగితం లాగ ఉన్నాడు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న స్థితి అప్పటిది.
ప్రగతి కథలకు పెద్ద పీటను వేసాడు.
తనకు లేమి అన్నది నిత్య జీవన విధానానికి – తెలిసి ఉన్నది, కాబట్టి,
నిరుపేదల అంశాలను, మధ్య తరగతి బ్రతుకుల సమస్యలతో కలిగి ఉన్న అనుబంధం వలన –
ఆకళింపు చేసుకున్న మనో స్పర్శతో – ఆ రోజులలో- సహజంగా తీయగలిగాడు.
దర్శకుడిగా ఎదిగాక, ధనవంతుడు అయ్యాడు కదా, కలిమి లేములు తూకం అంచనా తప్పింది.
ఇప్పుడు పేదల ఫీలింగులను – ఇదివరకులాగా – అంత సమర్ధవంతంగా తీయలేకపోతున్నాడు. వెండితెర కాస్తా – బంగారుమయం ఔతున్నది, ప్రజలకు కలలను పంచిపెడుతున్నది.”
భార్య విశ్లేషణకు ఆశ్చర్యంతో – కాస్సేపటిదాకా అట్టే నిలబడ్డాడు.
“భడవ, తెలివైనవాడే?”
అక్కచెల్లెళ్ళు ఇల్లు చేరాక – పంచపాళీలో అరుగుపై కూర్చుని అనుకున్నారు.
నానీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ;
 By – కాదంబరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ;
My story - link - mag - vihanga విహంగ   ;-   
అంతే తేడా … ;- 13/04/2018 కాదంబరి ;; 

Wednesday, March 7, 2018

బాల సాహిత్య - April 2 Intl Children's Book Day

మొగలి రేకులు ;-
తేట తేట తెలుగులోన ;
పాట పాడరే!
పాట,పదములందు ;
పాప నవ్వు- మువ్వలే ; ||
మొగలి రేకు మాటలన్ని - వెన్నెలల జాడలే!
వరుసలు, వరుసలుగాను- పేర్చి కుట్టి ;
దిష్టి తీయరే! - మెటిక లిరవరే! ; ||
భాష తోటలోన - వ్యాప్తి - రమ్య సుగంధం ;
మల్లె,జాజి,గులాబీ - గీతికలై గుబాళించెను ;
మనసుల లోగిళ్ళన్నీ - ఘుమ ఘుమ లాడేను ; ||
; &
బాల సాహిత్యము ;- [ essay ] ;- "జనులకు హితమును చేకూర్చేది సాహిత్యమని" ఆర్యులు భావించారు. నేటి సాహిత్యములో ఒక శాఖగా అలరుతూన్న "బాల సాహిత్యము" కూడా
ఈ భావనకు న్యాయము చేకూరుస్తున్నదని చెప్పవచ్చును. మనలోని అంతర్నేత్రాలకు సుదూర వర్ణమయ ప్రపంచాలను చూపించే
వాహిక పుస్తకము (సాహిత్యము).
"జలబిందు నిపాతేన క్రమశః పూర్వతే ఘటః స హేతుః సర్వ విద్యానాం, ధర్మస్య చ, ధనస్య చ"
బాల సాహిత్యము ఎలా ఉండాలి?
బాల బాలికలకు అర్థమయ్యేలా, బుడి బుడి నుడువులతో, నిష్కల్మష భావాలను ఆవిష్కరించ గలిగినప్పుడు,
బాల సాహిత్యము సార్ధకమౌతుంది. తేట తేట తెలుగు పదాలు కూర్చిన లయాత్మక గీతికలుగా ఉండాలి.
(అంటే వారి వారి మాతృ భాషలలో కూడా ఇదే వర్తిస్తుంది.
ఇంగ్లీషు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ వగైరాలున్నూ,
కొసకు సంస్కృత భాషలో ఐనా సరే! ఈ అలతి అలతి పదాల అన్వయ నియమము వర్తిస్తుంది) *** *** *** *** బాల గేయాలను 3 రకములుగా విభజించ వచ్చును. దేశ భక్తి గేయములు అభినయాత్మక క్రీడా గేయాలు నీతి కథా ఖండ కావ్యములు , దేశ భక్తి గేయాలు క్లిష్ట పదాన్వయ భరితముగా ఉన్నప్పటికీ,
గాన, లయ, తాళములతో ఒనగూడినవై శృతి సుభగత్వమును కలిగి ఉంటే మేలైన పద్ధతి.
; శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి పాటను ' ఆహ్లాదించుకోండి '.
"జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ! దివ్య ధాత్రి! జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి! జయ జయ సశ్యామల,సుశ్యామ చలచ్చేలాంచల ! జయ వసంత కుసుమ లతా చలిత లలిత పూర్ణ కుంతల! జయ మదీయ హృదయాశయ, లాక్షారుణ పద యుగళా!..." మరొక పాటను గమనిద్దాము... పై పాట ఎంత క్లిష్ట సమాస పూర్ణమైనదో
ఈ క్రింది ఉదాహృత రచనలు అంతటి తేట పదాలతో నిండి ఉన్నవి. "తేనెల తేనెల మాటలతో మన దేశ మాతను కొలిచెదమా! భావం, భాష్యం కలుపుకుని ఇక జీవన యానం చేయుదుమా..." దేశ భక్తి పాటలు, దైవ భక్తి పాటలు ఇట్టి సమాసములతో, భాషా పటిమనూ,
అటు చక్కెర చిలకల వంటి తేలిక పదాలతోనూ సమర్ధవంతముగా ఆబాల గోపాలమునూ అలరిస్తూంటాయి.
అల్లి బిల్లి పదాల ఈ గేయాలను అవలోకించండి.
"తాత వంటి తాత లేడు : గాంధి తాత వంటి తాత: ఎందు ఎంత వెదకిననూ లేడు, లేడు, కాన రాడు........ చిన్న నాటి నుండి పెద్ద బుద్ధులు కలవాడంట! .......పిన్నలలో పెద్ద అంట!........." ప్రసిద్ధ రచయిత (గుడిపాటి వేంకటాచలం)చలం గారు ఇలా అన్నారు: "పిల్లలకు పాటలను రాయడము చాలా కష్టము. దాని కంటే మహా కవి కావడము సులభము." పిల్లల వాఙ్మయము ఆ పలుకులు నిజమేనని నిరూపిస్తాయి. శ్రీ న్యాయపతి రాఘవరావు ( రేడియో అన్నయ్య ) రచనలు అనేకము ఉన్నాయి. వానిలో ఒకదానిని చదివి చూడండి. "పిల్లలకే స్వారాజ్యం వస్తే; పిల్లలకే స్వాతంత్ర్యం ఇస్తే చిట్టి తండ్రినీ రాజును చేస్తాం! చిట్టి తల్లినీ రాణిని చేస్తాం! || మా తాత ఒక బొమ్మయితేను; మా అవ్వ ఒక బొమ్మయితేను బొమ్మల పెళ్ళి ఇంపుగ చేస్తాం; కమ్మని విందులు గుమ్ముగ తింటాం! || సూర్యుడు ఎర్రని కాగితమైతే; చంద్రుడు తెల్లని కాగితమైతే వేడుక తోటీ తాడును కట్టి; గాలి పటంలా తేలించేస్తాం! || ..."
ఇలాగ మృదు మధురంగా సాగి పోతుంది. ;
శ్రీ రెడ్డి రాఘవయ్య గారి కలం చిందుల సొగసులను చూడండి. "పిల్లలం పిల్లలం, పిల్ల గాలి విసురులం! పిల్లలం పిల్లలం, మల్లె పూల జల్లులం ; || పిల్లలం పిల్లలం, తెల్ల మబ్బు తునకలం పిల్లలం పిల్లలం, ఎల్లరి కను విందులం! ; || ..."
శ్రీ శ్రీ ప్రఖ్యాత గేయం ఇది :
"మెరుపు మెరిస్తే,వాన కురిస్తే ఆకసమున హరి విల్లు విరిస్తే 'అవి మాకే!' అంటూ ఆనందించే కూనల్లారా! పాపం పుణ్యం, ప్రపంచ మార్గం కష్టం,సౌఖ్యం, శ్లేషార్ధాలూ ఏమీ ఎరుగని పువ్వుల్లారా! ఐదారేడుల పాపల్లారా!..." ఇలాగ సాగే ఈ కవిత "బాలల శ్రేయస్సును గూర్చి పెద్దలకు ఉపదేశిస్తూన్న కవితా లహరి గా పేర్కొన వచ్చును. "నిజమైన బాల సాహిత్యము మామిడి పండులా ఆపాత మధురంగా ఉండాలి. భాష సరళంగానూ, లలితంగానూ ఉండాలి. చెప్ప వలసినది విప్పి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉండాలి. బాల సాహిత్య వేత్తలు ఈ మూల సూత్రమును పాటించినంత కాలమూ, బాల వాఙ్మయము బాలల ఆదరణను పొందుతుంది" అని దాశరధి గారు అన్నారు. అక్షర జ్యోతి, అక్షరాస్యతా ఉద్యమాల వలన ' విద్యా ప్రగతి, ఆవశ్యకతను ' తెలిపే గేయాలు అనేకము వెలిసాయి. "పలుకుల తల్లి పిలిచెను చెల్లీ! చదువులపై నీ మనసును నిలుపు! ; ||
ఎంత కురిసినా ఆగని ధార! ఎంత త్రవ్వినా తరగని గనిలే! కదలవె బాలా! -అదరక,బెదరక కుదురుగ విద్యను నేర్చుకొనంగ ; || ఇల్లాంటిదే మరి ఒకటి: "రా రా చిన్నోడా! బళ్ళో కెడదాము ; ||
దొరలు దోచగ లేరు; దొంగ లెత్తుక పోరు. అన్న దమ్ములు వచ్చి, భాగ మడుగగ బోరు...."
అచ్చులను వరుస క్రమంలో బోధించే పాట,
గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన ...
"అక్షరాలను దిద్దాలి; ఆనందంతో మెలగాలి! ఇలలో అందరు చదవాలి; ఈ జగమంతా మెచ్చాలి.." అంటూ కొనసాగినది. "అ-ఆ -ఇ-ఈ-రావాలి; అందరమొకటై పోవాలి..."
అన్నారు. ఎం.లక్ష్మణాచార్యులు -

"వందనమమ్మా!వందనమమ్మా! తెలుగు తల్లి అభి వందనమమ్మా! అందరమొకటైని నీ ఉన్నతికై అహరహమూ కృషి చేసేమమ్మా! కుల మత భేదం మాకు లేదనీ ;
జగతి అంతటా చాటేమమ్మా!..." అన్నారు ;
"బాల ప్రపంచం; పాల ప్రపంచం పాల వలె తెల్లనిది,
పాల వలె తియ్యనిది!" అన్నారు ఏడిద కామేశ్వరరావు.
; "విరిసే పూవుల రేకుల్లారా! మురిసే చివురాకుల్లారా!"
అని పిల్లలను మెచ్చుకున్నారు కరుణశ్రీ.
;
వింజమూరి శివరామారావు చాచా నెహ్రూజీని తలుస్తూ, రచించిన పాట "ఏమి నోము నోచినదో, ఈ ఎర్రని గులాబీ;
అందుకున్నదెల్లెడలా;
అందరి మన్ననలు" ప్రజల హృదయాలను కరిగించినది. "అందమైన చందమామ ;
అందరాని చందమామ:
అమ్మా! నా చేతిలోని అద్దములో చిక్కినాడే!....."
;
ఎంత మనోజ్ఞ భావనమిది!
"భావ కవి"గా పేరెన్నిక గాంచిన శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి రాసిన బాల గేయాలు లావణ్య రాసులే.
ఆంధ్ర దేశములోని జల సంపదను వర్ణించిన ఆయన గేయ ఫణితి అమోఘమైనది. "తరలి రారమ్మా!2 ; || గౌతమి,మంజీర, ఓ నాగావళి,వంశ ధార; తుంగ భద్ర, పినాకినీ; ఉత్తుంగ భంగా కృష్ణ వేణీ! ; || నురుగుల ముత్యాల చెరగుల; తరగ మడతల పావడాల; తురిమి సిగలో రెల్లు పూ మంజరులు; ఝరులౌ సోయగముతో ; ||
తరలి రా రమ్మా! ; ||
ఈ మనోజ్ఞ గేయ పంథాలో బాల సాహిత్య సృజన కర్తలకు ఇలా మనవి చేస్తున్నాను; "తరలి రారండీ! తరలి రారండీ! ; ||
నగవుల ముత్యాలు చల్లగ; పలుకు మల్లెల గూడు లల్లి; అలరు బాలల జగతి కొరకై ; కథలు ,నుడువులు,గేయములను; సృజన చేసే మహిత శీలురు; తరలి రారండీ! ............
;
"ఇపుడే వస్తానమ్మా! తొందర చేయొద్దమ్మా!" -------------------------------------------- అంటూ సాగే ఈ పాట బాల బాలికల నిష్కల్మష ప్రవృత్తికి అద్దం పడ్తూన్నది. పిల్ల గాలి ఊసులన్ని - చిన్ని పూల బాసలన్ని మనసు విప్పి చెబుతుంటే- చెవులొగ్గి వింటున్నా! ఇపుడే వస్తానుండమ్మా! కొంచెం సేపు ఆగమ్మా! || వన్నె వన్నె ఈకలనూ - చిన్ని రాళ్ళు ,గవ్వలను మెల్ల మెల్లగా ఏరి- పోగు చేసుకును చేసుకుని నేను ఇపుడే వస్తానమ్మా! చిడి ముడి చేయొద్దమ్మా! || గడ్డి పూల సొగసులను, వెన్నెలకు అందిస్తా! అందమైన ప్రకృతికి- బాల సారె,పేరు పెట్టి ఆనందపు ఋతువులకు - అ-ఆ-లను దిద్దించి , అమ్మా! నే వస్తాగా! తొందర చేస్తావేమి?! || బుల్లి బుల్లి పిట్టలకు- మాటలు నేర్పిస్తానే! చిరు జల్లుల వానలను- ఆటలు ఆడిస్తానే! అలల నురుగు చిన్నెలను-
హరి విల్లుకు చూపించి,
పరిచయాలు చేసొస్తా!
ఇపుడె వస్తా!ఆగమ్మా! || అమ్మా!ఇపుడే వస్తా! హడావుడి చేయొద్దు! ||
; (రచయిత్రి: పి.కుసుమ కుమారి) ప్రాచీన కాలం నుండీ" భక్తి గాన వాహిని " మన దేశములో దివిజ గంగా ప్రవాహముల జల పాతములై,
జనావళిని సంతోష సంరంభములలో ఓలలాడించినది. బాల కృష్ణునిపై భక్తి, వాత్సల్యములతో, ఘంటములు, కలములు వేసిన ప్రతి చిందు ,
సంగీత,నాట్యములకూ బంగారు వేదికలను అమర్చాయి. అలాగే, మాతృ ప్రేమ వెలువరించిన జోల పాటలు మల్లెల సౌరభాల సందడులను వెలయించినవి. శ్రీ నారాయణ తీర్ధుల వారి "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" ఆపాత మధురమే! "ఆలోకయే!శ్రీ బాల కృష్ణం!....."
మొదలైన పాటలు సంగీత, నాట్య జగత్తులలో సుస్థిర కీర్తిని గాంచినవి.
అన్నమాచార్యులు కృతి "జో అచ్యుతానంద!జో జో ముకుందా!......" సుప్రసిద్ధమైనదే! గోపి, రాయప్రోలు వామన మూర్తి, వెల్దుర్తి మాణిక్యాల రావు,
దొప్పల పూడి రాధా కృష్ణ మూర్తి, రాచకొండ విశ్వనాధము,
యడ్లపాటి నారాయణమ్మ, విభావసు ప్రభాకర శర్మ, మంగా దేవి,
స్వరాజ్యం రామ కృష్ణమ్మ, రమణమ్మ మున్నగు వారెందరో బాల గీతికా మంజరులను విరబూయిస్తూన్నారు. వెలగా వెంకటప్పయ్య (తెనాలి), విశ్వేశ్వరరావు(గుంటూరు) మున్నగు మహనీయులు ఎందరో, తేట తెనుగులోని అందాలను, బాల సాహిత్యానికి చేస్తూన్నట్టి అవిరళ సేవల ద్వారా, ప్రజలకు అందిస్తున్నారు.
అమెరికా మున్నగు విదేశాలలోని ప్రవాసంధ్రుల ఎనలేని కృషి తెలుగు సాహిత్య బృందావనిని నిరంతరమూ అంద చందాలతో, పరిమళాలతో ఘుబాళింప జేస్తున్నాయి. ఏప్రిల్ 2 వ తేదీ "అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవము".
హన్స్ క్రిష్టియన్ ఆండెర్సన్ అనే రచయిత పుట్టిన రోజు సందర్భముగా నెలకొనబడినది
ఈ "ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ బుక్ డే" ; 17, జులై 2009, శుక్రవారం POST ; in my BLOG = LINK ;- [ KONAMANINI- 1 ]

అమ్మా! ఇపుడే వస్తా!

పిల్ల గాలి ఊసులన్ని 
చిన్ని పూల బాసలన్ని 
మనసు విప్పి చెబుతుంటే ;
      ఇపుడే వస్తానమ్మా!
           కొంచెం సేపు ఆగమ్మా!   || 
వన్నె వన్నె ఈకలను 
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
      ఇపుడే వస్తానుండమ్మా!   || 

గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
      ఇపుడే వస్తాను ! ఆగమ్మా!   || 

అందమైన ప్రకృతికి 
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
      అమ్మా! నే వస్తాగా!
            తొందర చేస్తావేమి !?!   || 

5) బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
      అమ్మా!ఇపుడే వస్తా! 
            హడావుడి చేయొద్దు!   || 
      ఇపుడే వస్తానమ్మా!
           కొంచెం సేపు ఆగమ్మా!   || 
;
[ అమ్మా! ఇపుడే వస్తాను! ] - 
********************************;
kid's song - 2 ;-
బాపూజీ ;-
బోసి నవ్వుల బాపు ; నోటి: నుండి వచ్చినదె వాక్కు ; 

తాను పలికిన పలుకు ; జవ దాటనట్టి ; అపర ఋత్విక్కు ; || 
;********************************;;
;
kid's song - 3 ;-
వెన్నెల రేడా! ;-
ఉయ్యాలోయ్! ఉయ్యాల!
అట్ల తద్దెకూ ఉయ్యాల! 

కొమ్మల కట్టెను మా మామయ్య  || 
********************************;
▼  January (76) ;- 
శ్రీ వేంకటేశుడు ,కోవెల (కసం)
మంగమ్మ చూపులే రంగారు బంగారు
1. ఆహ్వానం ; 2. గోరింట ; 3. బుంగ మూతి ; 4. దిగి రావోయీ! జాబిల్లీ! ;
5. వెలుగుల నవ్వులు ; 6. ఆకులు, పూవులు ; 7. లిపి -కోవెల ; 8. వెన్నెల నాట్యాలు ;
10. అచ్చట,ముచ్చట ; 11. చదువు ముందు ; 12. కస్తూరి నామములే వరములు ;
13. నెమలి ఈక ; 14. జేజేలు ; 15. అమ్మ మెచ్చుకున్నది ; 
& new year 2009 &
16. మొగలి రేకులు ; 17. అమ్మా!ఇపుడే వస్తా ! + ;
18. అచ్చులు, హల్లులు నేస్తములు ; 19. పాటల బాటలు ;  20. గాంధీ 1 ; 21. బాపూజీ ;
22. వెన్నెల రేడా! ; 23. హరి విల్లు బహుమతి ; 24. అమ్మలు నవ్వులు ; 25. ఉషస్సు ;
26. "భూమి పుస్తకము" ;  27. వెన్నెలా!వెన్నెలా! ;  28. మరకత మణులు ;
29. జాతీయ పక్షి ; 30. మల్లికా, మల్లికా ;
31. సీతాకోక చిలకలు ; 32. వెన్నపూసల దండలు ;
33. విన్నపములు 3 ; 34. విన్నపములు 2 ; 35. విన్నపములు 1 ;;

36. ఆటపట్టు ; 37. మామ కాని మామ ;  38. కరచాలనము ; 
39. నవ్వుల ముగ్గులు ; 40. నవ్వుల ముగ్గులు - 2 ;;;
41. కుంకుమ భరిణలు ; 42. భరిణలు ; 43. సుస్వాగతము ; 44. వెన్నెల రథము ; 
REF LINES ;-
వెన్నెలా! వెన్నెలా! ;-
వెన్నెలా! వెన్నెలా! - మిన్నుల్లొ వెన్నెల ;
కన్నుల్లొ కురియగా - కాణాచి వెన్నెల ;   ||
&
మరకత మణులు ;-
మా పాపాయి నడకలె నాట్యాలు ;
ఇలలో కౌస్తుభ , చూడా మణులు ;
కనుకనె కృష్ణుడు దిగి వచ్చాడు ;
క్రీడా మయమగు నీ భువి సర్వం!   ||
&
సీతా కోక చిలకమ్మలు :-

సీతా కోక చిలకమ్మలు 
వచ్చేసాయి! వచ్చేసాయి!   ||

అడవిలొ , సీతకు ఇచ్చిన కోకలు 
ఇవే! ఇవే! " అని చూపిస్తూన్నవి 
తమ రంగుల రెక్కలు !   ||
&
కరచాలనము ;-   చుక్కలతో స్నేహము ;-
            తళుకు తళుకు చుక్కలు ;
-               మిణుకు మిణుకు చుక్కలు ;
        -    మబ్బు గొడుగు లేసుకుని ; 
                  గొబ్బున ఇటు వచ్చినవి  ;
&
14, డిసెంబర్ 2008, ఆదివారం ;- POST :-▼  December (66 posts) ;  
లోకోక్తి , ఔచిత్యము ;-
గురుషు మిలితేషు శిరసా :
ప్రణమసి లఘుషూన్నతా  సమేషు సమా :
ఉచిత జ్ఞాసి తులే! కిమ్ ?
తులయసి గుజ్జూ ఫలైః కనకం :
;
త్రాసా! గురువులు వచ్చినప్పుడు - శిరస్సు వంచుతావు.
లఘువులు వచ్చినప్పుడు - ఉన్నతంగా ఉంటావు.
సమానస్తులు, గురువులు వచ్చినపుడు - సమముగా ఉంటావు.
"ఈ తీరుగా ఉచితము(=ఔచిత్యము)ను తెలిసిన దానివి", 

ఐనా కూడా బంగారమును 
గురువిందలతో తూచుతూ ఉన్నావు, ఏలనో?
J J  J  J J  J  J J  J  J J  J    J J  J     
see here ;- 
Link ;- 7, జనవరి 2009, బుధవారం post ; konamanini  ;-